USA: భారత ఎన్నికల్లో జోక్యం.. రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా

  • భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపణ
  • సిక్కు వేర్పాటువాది హత్యాయత్నం వెనక భారత్ హస్తం ఉందనేలా అమెరికా ఆధారాలు చూపలేదని వెల్లడి
  • తాము ఏ దేశ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోబోమన్న అమెరికా
  • సిక్కు వేర్పాటువాది హత్యాయత్నం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము స్పందించబోమని స్పష్టీకరణ
US refutes russians allegations on meddling in indian elections

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ తాజా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘మేము ఏ దేశ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోము. ఈ ఎన్నికల్లో నిర్ణయాలు భారత ప్రజలవి మాత్రమే’’ అని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు రోజు రష్యా అమెరికాపై పలు సంచలన ఆరోపణలు చేసింది. భారత ఎన్నికలను అమెరికా ప్రభావితం చేస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. మత హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ అమెరికా ఎప్పటిలాగే భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. దేశ అంతర్గత రాజకీయ పరిస్థితిని ఒడిదుడుకులపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘మతస్వేచ్ఛ ఉల్లంఘనలు జరిగాయంటూ అమెరికా భారత్ పైనే కాకుండా, అనేక ఇతర దేశాలపై నిర్హేతుకమైన నిందలు మోపుతుంటుంది. ఆయా దేశాల జాతీయతపై అమెరికాకు ఉన్న తప్పుడు అవగాహనకు ఇది సూచన. ఇది భారత్‌‌ను, ఆ దేశ నేపథ్యాన్ని అవమానించడమే’’ అని పేర్కొన్నారు. 

సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్‌ పన్నున్‌పై హత్యాయత్నం వెనక భారత్ ఉందనేందుకు విశ్వసనీయ ఆధారాలను అమెరికా ఇంకా వెల్లడించలేదని కూడా రష్యా ప్రతినిధి అన్నారు. కాగా, పన్నున్ హత్యాయత్నం కేసుపై వ్యాఖ్యానించేందుకు అమెరికా ప్రతినిధి నిరాకరించారు. ఇది కోర్టు పరిధిలోని అంశమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News